రాజకీయ దురుద్దేశంతోనే రాహుల్ గాంధీపై కేసులు: నుమాన్ మహమ్మద్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జడ్జి విశాల్ గోగ్నే PMLA కింద విచారణకు అవసరమైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించడంతో గాంధీ కుటుంబం నిజాయితీకి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ దేశ స్వాతంత్ర్య ఆశయాలకు గొంతుగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2008లో పత్రిక మూతపడినప్పటికీ, 2010లో కాంగ్రెస్ పార్టీ ‘యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా పునరుద్ధరించబడిందని చెప్పారు.
2012లో బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి ఫిర్యాదు చేసిన ఈ కేసు 13 ఏళ్లుగా కొనసాగుతోంది. మనీ లాండరింగ్ జరగిందని నిరూపించే ఏ ఆధారమూ లేదని, గాంధీ కుటుంబం పత్రిక ఆస్తులను వ్యక్తిగతంగా స్వాధీనం చేసుకున్నట్టు రుజువులు లేవని నుమాన్ మహమ్మద్ స్పష్టం చేశారు.
గత 11 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీని రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని, భయపడకుండా నిలబడిన వారిని జైలుకు పంపడమే పరిపాటిగా మారిందని అన్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉదాహరణలని ఆయన గుర్తు చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని 50 గంటలకు పైగా విచారించినప్పటికీ ఎలాంటి నేరం రుజువు కాలేదని, బీజేపీ నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరగడం లేదని, బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన వారిపై చర్యలు తీసుకోవడం లేదని నుమాన్ మహమ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలు, దళితులు, బడుగు, మైనార్టీల గొంతుగా నిలుస్తున్న రాహుల్ గాంధీని ఇబ్బందులకు గురి చేయడమే ఈ కేసుల లక్ష్యమని ఆయన చెప్పారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎంత విషప్రచారం చేసినా గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు, త్యాగాలు చెరిగిపోవని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఇందుకు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

Post a Comment