పాల్వంచలో పోటు కృష్ణమూర్తి విగ్రహం ఏర్పాటు చేయాలి - ఎస్.జె.కె. అహ్మద్
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం పాల్వంచ పట్టణంలో పోటు కృష్ణమూర్తి సతీమణి పోటు లక్ష్మిని అహ్మద్ సన్మానించి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్.జె.కె. అహ్మద్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో పోటు కృష్ణమూర్తి పేరు చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
కేటీపీఎస్ ప్రాంగణంలో ఆంధ్ర పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా “గో బ్యాక్ ఆంధ్రా” అంటూ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నాయకుడు పోటు కృష్ణమూర్తి అని పేర్కొన్నారు. 1969 లో 14 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తెలంగాణ ఉద్యమానికి కొత్త ఊపిరి పోసారని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధనకై పోటు కృష్ణమూర్తి చేసిన సేవలను ఉద్యమాన్ని స్మరింపజేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాల్వంచలో స్థలాన్ని కేటాయించి పోటు కృష్ణమూర్తి విగ్రహ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అహ్మద్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో పోటు కృష్ణమూర్తి పోషించిన కీలక పాత్రను అధికారికంగా గుర్తించి వారికి తగిన గౌరవం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ అక్బర్, జారే బిక్షం, ఆళ్ల రాఘవ, ఎస్.ఏ. నయుం, రామినాయుడు, ఆసిఫ్,పోటు ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment