పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన వ్యక్తికి జైలు శిక్ష
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్ కుమార్ శుక్రవారం తీర్పు వెలువరించారు.
కేసు వివరాలు ఇలా ఉన్నాయి..2021 నవంబరు 26న అర్ధరాత్రి పాల్వంచ ఇందిరా కాలనీకి చెందిన కళానిధి ప్రేమ్ సింగ్ అర్ధరాత్రి అనుమతి లేకుండా పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో హెడ్ కానిస్టేబుల్ హరిబాబు, కానిస్టేబుల్ కృష్ణ ప్రసాద్ విధుల్లో ఉన్నారు.
స్టేషన్‌లోకి ప్రవేశించిన నిందితుడు సబ్ ఇన్స్పెక్టర్ రూమ్ టేబుల్‌పై ఉన్న అద్దాలను పగలగొట్టి.. 90వేల రూపాయల ఆస్తి నష్టం చేయడంతోపాటు..సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించాడు. అడ్డుకోవడానికి వచ్చిన కానిస్టేబుళ్లపై అతడు చేతిలో ఉన్న కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రూమ్ డోర్ అద్దం, జిరాక్స్ మిషన్, రెండు కుర్చీలు, ఎస్సై రూమ్ కబోర్డ్, స్టేషన్‌లోని పెద్ద అద్దం, రికార్డు రూమ్‌లోని బీరువా అద్దాలు తదితర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశాడు.
హెడ్ కానిస్టేబుల్ హరిబాబుపై వరుసగా రెండు సార్లు కత్తితో దాడి చేయడానికి యత్నించగా తృటిలో తప్పించుకున్నారు. మూడోసారి చేసిన దాడిలో హరిబాబు ఎడమ చేతికి తీవ్ర గాయం అయ్యింది. అనంతరం హరిబాబు, కృష్ణ ప్రసాద్‌లు నిందితుడిని అదుపులోకి తీసుకుని అప్పటి ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.
ఈ ఘటనపై అప్పటి ఎస్సై జె. ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు మొత్తం ఎనిమిది మంది సాక్షులను విచారించి నిందితుడి నేరం ఋజువైనట్లు తేల్చింది.
దీంతో నిందితుడు కళానిధి ప్రేమ్ సింగ్‌కు
• IPC 307 ప్రకారం 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా
• IPC 427 ప్రకారం 3 సంవత్సరాల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా
• పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,000 జరిమానా విధిస్తూ, అన్ని శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు వాదించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, లైజన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, పి.సి. జరుపుల రవి సహకరించారు.
.webp)
Post a Comment