ఎస్.ఆర్.కే.టి స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం) వేడుకలను కొత్తగూడెం మేదరబస్తిలోని ఎస్.ఆర్.కే.టి పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేటి బాలలే రేపటి పౌరులు… విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు” అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా తన బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ, 1979లో ఏలకుర్తి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న రోజుల్లో సైకిల్ దుకాణంలో పనిచేయడం, వ్యవసాయ పనులు చేయడం వంటి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని తెలిపారు. “ఎన్ని కష్టాలొచ్చినా చదువు విడిచిపెట్టొద్దు. విద్య ఉంటే గొప్ప స్థానాలకు ఎదగవచ్చు” అని విద్యార్థులను చైతన్యపరిచారు.
ఎస్.ఆర్.కే.టి స్కూల్ యాజమాన్యం నాణ్యమైన విద్యను అందిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ఆధునిక విద్యాబోధన అందిస్తున్నందుకు ఆయన అభినందనలు తెలిపారు. విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు విద్యార్థుల సంపూర్ణాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
అనంతరం ఆటల పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు మెజిస్ట్రేట్ రాజమల్లు బహుమతులు అందించారు. అనంతరం ఎస్.ఆర్.కే.టి స్కూల్ యాజమాన్యం తరఫున మెండు రాజమల్లును శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు వెంకటరామరాజు, జి.హెచ్.రామ్, ప్రిన్సిపాల్ టి. స్వర్ణ, వైస్ ప్రిన్సిపాల్ సోలోమన్, పి.ఇ.టి జగన్, బీసీ జిల్లా అధ్యక్షులు అంకిలేడు ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post a Comment