మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలి – ఎస్పీ రోహిత్ రాజు

మాదకద్రవ్య రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలి – ఎస్పీ రోహిత్ రాజు
 
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  జిల్లాలో మాదకద్రవ్యాల సమూల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ తెలిపారు.

“చైతన్యం” పేరుతో అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు నెల రోజులపాటు జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆధ్వర్యంలో గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలన కోసం వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ “చైతన్యం” పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల రోజులపాటు జిల్లా పోలీసులు చేపట్టే కార్యక్రమాలలో ప్రజలు కూడా భాగస్వాములై తమ వంతు బాధ్యతగా సహకరించాలని ఆయన కోరారు.

మత్తుకు బానిసలుగా మారిన యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వారిలో చైతన్యం నింపేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ తెలిపారు.

జిల్లాలోని గంజాయి హాట్‌స్పాట్లలో నిత్యం తనిఖీలు చేపట్టడం, ఎవరైనా మత్తు పదార్థాలను సేవిస్తూ పట్టుబడితే వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించడం, వాహన తనిఖీలు వంటి కార్యక్రమాలను ఒక ప్రణాళిక ప్రకారం అమలు చేస్తున్నామని వివరించారు.

ఎవరైనా నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్నా, విక్రయిస్తున్నా, సేవిస్తున్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ప్రజలను కోరారు.

“చైతన్యం” పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, ఎస్బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమాకాంత్, ఎస్సైలు ప్రవీణ్, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertising:

Blogger ఆధారితం.