పెండింగ్ దరఖాస్తులపై దృష్టి సారించాలి: ఎలక్ట్రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎలక్ట్రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి సూచించారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ జితేష్ వి. పాటిల్ తో కలిసి ఆమె స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025పై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా, జిల్లా కార్యాలయంలో విచ్చేసిన బాలమాయాదేవికి కలెక్టర్ పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం, పోలింగ్ కేంద్రాలు, ఓటర్ ఐడీ కార్డుల జారీ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలు తదితర అంశాలను కలెక్టర్ వివరించారు.
ఎలక్ట్రోల్ అబ్జర్వర్ బాలమాయాదేవి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచనల మేరకు షెడ్యూల్ ప్రకారం క్షేత్రస్థాయిలో ఎన్నికల విధులు నిర్వహించాలన్నారు. అలాగే, పెండింగ్‌లో ఉన్న ఫారమ్ 6, 7, 8 దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి, దివ్యాంగ ఓటర్లను గుర్తించి వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు.
భవిష్యత్తులో, అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి, వారి సూచనలు ఎన్నికల కమిషన్కు పంపించాలని, నాణ్యమైన ఓటర్ ఎపిక్ కార్డులను ప్రింట్ చేసి పంపిణీ చేయాలని చెప్పారు. ఇంకా, ఓటర్ అవగాహన కోసం వివిధ విద్యాసంస్థల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, భద్రాచలం ఆర్డీవో దామోదర్ రావు, తహసిల్దార్లు, ఎలక్షన్ సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా తదితర అధికారులు పాల్గొన్నారు.

Post a Comment