గ్రామాలలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ తో ప్రజలకు మరింత చేరువుగా సమాచారం: కలెక్టర్ జితేష్ వి పాటిల్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: గ్రామీణ ప్రాంతాల్లో సమాచారాన్ని ప్రజలకు మరింత చేరువ చేయడంలో బీఎస్ఎన్ఎల్ కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్‌లో ఇండియన్ టెలికం సర్వీస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి. భాస్కరరావు నేతృత్వంలోని బృందం కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ అందుబాటులోకి రావడం ద్వారా విద్యార్థులు, యువత, గ్రామీణ ప్రజలు క్షణాల్లోనే సమాచారం తెలుసుకునే అవకాశముంటుందని తెలిపారు.
ప్రతి మండలంలో ఒక పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకుని బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామాల్లో నెట్‌వర్క్ బలోపేతం చేస్తే ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత చేరువవుతాయని, యువత ఉద్యోగావకాశాలను సులభంగా తెలుసుకునే వీలు కలుగుతుందని పేర్కొన్నారు.
దేశంలో జరుగుతున్న పరిణామాలు, కరెంట్ అఫైర్స్ విషయాలు సులభంగా తెలుసుకోవడమే కాకుండా, మొబైల్ నెట్‌వర్క్ ద్వారా గ్రామీణ యువత సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో నిలుస్తారని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి. భాస్కరరావు కలెక్టర్ జితేష్ వి. పాటిల్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఐటీఎస్ డైరెక్టర్ ఎం. అరవింద్, ఐటీఎస్ అసిస్టెంట్ డైరెక్టర్ జి. గణేష్ కుమార్, ఏటీఎం జి. సుభాష్, ఎస్‌డీఈ సక్రు, ఎంఆర్డివి శివరాంజి తదితరులు పాల్గొన్నారు.
Advertising:


Post a Comment