మానసిక వికలాంగురాలిని గర్భవతిని చేసిన కేసులో వ్యక్తికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

మానసిక వికలాంగురాలిని గర్భవతిని చేసిన కేసులో వ్యక్తికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం : మానసిక వికలాంగురాలిని గర్భవతిని చేసిన కేసులో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్. సరిత మంగళవారం తీర్పు వెలువరించారు.

కేసు వివరాల్లోకి వెళితే… 2022 ఫిబ్రవరి 10న పాల్వంచ హమాలి కాలనీకి చెందిన ఆకుల చిన్నక్క, మానసిక వికలాంగురాలైన తన కుమార్తెను ఇంటివద్దే ఉంచి ప్రతిరోజూ కూలీ పనులకు వెళ్లేది. అదే కాలనీకి చెందిన ఆమె మరిది కుమార్తె శైలజ ఆయాగా పనిచేస్తుండగా, చిన్నక్క కుమార్తె కొన్ని రోజులుగా నీరసంగా ఉండటం, పొత్తికడుపు పెరగడం గమనించి ప్రెగ్నెన్సీ కిట్‌తో పరీక్షించగా గర్భం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది.

దీనిపై బాధితురాలిని ప్రశ్నించగా, ఆమెను వెంటబెట్టుకుని ఇంటింటికి వెళ్లి అడగగా హమాలి కాలనీకి చెందిన పూనెం ప్రభాకర్‌ను గుర్తించింది. నిందితుడు తనతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు అంగీకరించి, తిరిగి వస్తే చంపుతానని బెదిరించి పరారయ్యాడని చిన్నక్క పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ జే. ప్రవీణ్ కేసు నమోదు చేయగా, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి. సత్యనారాయణ దర్యాప్తు పూర్తిచేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో మొత్తం 14 మంది సాక్షులను పరిశీలించారు.

విచారణ అనంతరం నేరం రుజువుకావడంతో, పూనెం ప్రభాకర్‌కు వివిధ సెక్షన్ల కింద 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5,000 జరిమానా, మూడు నెలల కఠిన కారాగార శిక్ష, రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్షలను ఏకకాలంలో అనుభవించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసును అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.వి.డి. లక్ష్మి వాదించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎస్. వీరభద్రం (కోర్టు డ్యూటీ ఆఫీసర్), పి.సి. జే. రవి సహకరించారు.


Blogger ఆధారితం.