మహిళని కొట్టిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష
జె.హెచ్.9.మీడియా, దమ్మపేట : ఓ మహిళని అవమానపరుస్తూ కొట్టిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ దమ్మపేట జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ డాక్టర్ వి.భవాని శుక్రవారం తీర్పు చెప్పారు.
కేసు వివరాల ఇలా..2018 మార్చి 6న దమ్మపేట మండలంలోని పెద్దగొల్లగూడెం గ్రామానికి చెందిన మారుతి సీతారాములు, ఆర్.రఘురాం, ఎం. వెంకటేశ్ లు కలిసి దమ్మపేటకు చెందిన రూప గురువమ్మపై దాడి చేసి అవమానపరచగా,రూప గురువమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆమె ఫిర్యాదు ప్రకారం.. “గురువమ్మ గత 27 ఏళ్లుగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.. అయితే, 2018 మార్చి 6న జీడి మామిడి తోటలో ఆమె పని చేసేందుకు వెళ్ళగా, మారుతి సీతారాములు, ఆర్.రఘురాం, ఎం. వెంకటేశ్ లు తోటలోకి రాకూడదని చెబుతూ ఆమెపై దాడి చేశారు అని పేర్కొన్నారు. జుట్టు పట్టుకుని లాగి, జాకెట్ చించి, బూతులు తిట్టి, సెల్‌ఫోన్ లాక్కొన్నారు” అని రూప గురువమ్మ వాపోయారు.
ఆమె ఫిర్యాదు మేరకు..దమ్మపేట పోలీస్ స్టేషన్‌లో అప్పటి సబ్‌ఇన్‌స్పెక్టర్ జే. ప్రవీణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కోర్టులో సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన అనంతరం ముగ్గురు నిందితులపై నేరం రుజువైందని తేల్చిన న్యాయమూర్తి, వారికి రెండు సంవత్సరాల 7 నెలలు జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలు ఏపీపీ కె. శ్రీనివాస్ వినిపించగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ మీ రాంబాబులు సహకారం అందించారు.
Advertising:


Post a Comment