చిరుత పులి గోర్లు తస్కరించిన వ్యక్తికి జైలు శిక్ష
కేసు వివరాల ప్రకారం... చంద్రుగొండ మండలం అబ్బుగూడెం బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నంబర్ 35 (బి–2) ప్రాంతంలో 2016 జూలై 3న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎం. రమేష్‌బాబు వ్యక్తిగత సమాచారం ఆధారంగా తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో అటవీ ప్రాంతంలో ఒక చిరుత పులి మృతదేహం కనబడింది. దానికి గోర్లు కోసి తీసుకెళ్లినట్లు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు సమీప ప్రాంతంలో వెతికినప్పుడు మరో చిరుత పులి కూడా మృతదేహంగా కనుగొన్నారు.
ఈ ఘటనపై రామవరం రేంజ్ ఆఫీసర్ జి. మధుసూదన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో ముద్దాయిలు రెండు మేకలు కనబడకపోవడంతో అడవిలో వెతుకుతూ, చిరుత పులులు వాటిని చంపేశాయని భావించి, మోనోక్రోటోఫాస్ అనే విష మందును మేకలపై ప్రయోగించినట్లు తేలింది. ఆ మేకలను తిన్న రెండు చిరుత పులులు చనిపోయాయి.
తదుపరి దర్యాప్తులో మొదటి చిరుత పులి యొక్క నాలుగు కాళ్ల గోర్లు మరకల లక్ష్మారెడ్డి వద్ద నుండి రికవరీ చేశారు. ఈ కేసులో అబ్బుగూడెం గ్రామానికి చెందిన భూష సత్యం, పోతిని మంగయ్య, బుస హనుమంతరావు, కర్రీ ఆశయ, మరకల లక్ష్మారెడ్డి, మిడియా లక్ష్మయ్యలపై చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సమయంలో మిడియా లక్ష్మయ్య మరణించగా, మిగతా ఐదుగురిపై నేరం రుజువు కాలేదు.
అయితే, మరకల లక్ష్మారెడ్డి నేరం చేసినట్లు రుజువవడంతో ఆయనకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
కేసులో ప్రాసిక్యూషన్ తరఫున నాగలక్ష్మి, విశ్వశాంతి లు వాదనలు వినిపించగా, కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్.ఐ. ఆర్. ప్రభాకర్, కోర్టు లైజన్ ఆఫీసర్ శ్రీనివాస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కల్పన సహకరించారు.
Advertising:


Post a Comment