వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలి - సీఎస్
జె.హెచ్.9. మీడియా: రానున్న వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా కార్యచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఇతర ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో సాగునీరు, త్రాగునీరు, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా, రైతు భరోసా, రబీ సీజన్‌కు సాగునీటి సరఫరా, యూరియా కొరత, రేషన్ కార్డుల జారీ, రెసిడెన్షియల్ పాఠశాలల సందర్శన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ వచ్చే వేసవికాలం దృష్ట్యా ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా కార్యచరణ రూపొందించి నిరంతరం నీటిని అందించే విధంగా ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని తెలిపారు. రబీ సీజన్ కోసం సాగునీటి సమస్య లేకుండా ప్రాజెక్టులు, చెరువులపై సమీక్షించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ సాగులో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ఈ నేపథ్యంలో యూరియా కొరత లేకుండా చూడాలని తెలిపారు.
వేసవికాలంలో వ్యవసాయానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అర్హత గల ప్రతి రైతుకు రైతు భరోసా అందించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలలను జిల్లా అధికారులు సందర్శించి, పాఠశాలలో నెలకొన్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి మరియు జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ రంగానికి, త్రాగునీటికి, నిర్మాణ రంగానికి విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాలో విద్యుత్ వినియోగంపై అధికారులతో సమీక్షించి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రైతు భరోసా పథకం కింద అర్హులైన అందరికీ పథకం అందించే విధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు చేపడుతున్నామని, రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, శాసనమండలి సభ్యుల ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన వెంటనే అర్హులైన వారందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్య లేకుండా జిల్లాలోని మారుమూల ప్రాంతాల వరకు నీటిని అందించేందుకు అధికారుల సమన్వయంతో కార్యచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, మిషన్ భగీరథ ఈఈలు తిరుమలేష్, నలిని, జిల్లా విద్యుత్ శాఖ అధికారి జి. మహేందర్, నీటి పారుదల శాఖ ఈఈ రాంప్రసాద్, పౌర సరఫరాల శాఖ అధికారులు త్రినాధ్ బాబు, రుక్మిణి, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ శేషాంజన స్వామి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment