జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక వైద్య శిబిరం
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ప్రపంచ బధిరుల దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం, బాబు క్యాంప్‌లోని భవిత సెంటర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం మూగ, చెవిటి పిల్లలకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “వైకల్యం అనేది ఒక ఘటన మాత్రమే కానీ సమస్య కాదు. దీనిపై సమాజం చైతన్యవంతం కావాలి” అని పేర్కొన్నారు. లక్ష్య సాధనలో, ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో వైకల్యం ఎప్పుడూ అడ్డంకి కాదని తెలిపారు.
దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం అమల్లో ఉందని, అందులో వారికి ఉండాల్సిన హక్కులు పొందుపరిచినట్లు చెప్పారు. అంగవైకల్యం వారికి శాపం కాదని, ప్రభుత్వం అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అలాగే, దివ్యాంగులు స్వతంత్రంగా జీవించడానికి తల్లిదండ్రులు సహాయ సహకారాలు అందించాలనీ, స్వతంత్ర జీవనం వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. అనంతరం, ముగ్గురు బధిర పిల్లలకు జిల్లా సంక్షేమ శాఖ సహకారంతో వినికిడి పరికరాలు అందజేశారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇఎన్టీ నిపుణుడు డాక్టర్ షఫీన్, మెడికల్ ఆఫీసర్, సిబ్బంది పిల్లలకు వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత, ఎంఈఓ బాలాజీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, భవిత సెంటర్ సిబ్బంది, స్టాఫ్ నర్స్‌లు పాల్గొన్నారు.
Advertising


Post a Comment