మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది 'ఎర్రజెండా'నే - ఎస్.కె. సాబీర్ పాషా
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: మట్టిమనుషులను పోరాట యోధులుగా మార్చింది కమ్యూనిస్టుల ఎర్రజెండానేనని, కమ్యూనిస్టులతో మమేకమై నాటి మట్టిమనుషులు సాగించిన విరోచిత పోరాట ఫలితమే నేటి ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా అన్నారు.
సెప్టెంబర్ 11నుండి 17వరకు సిపిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా శనివారం పాల్వంచ పట్టణంలోని స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ నుండి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అమరజీవులు వృషారావు, నాదెండ్ల రామకోటయ్య, ఉప్పుశెట్టి ఖాదర్ బాబు స్మారక స్థూపాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాత RDO కార్యాలయం రోడ్డులోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నాయకులు నల్లమల్ల గురుప్రసాద్ చిత్రపటానికి, సిపిఐ మాజీ రాష్ట్ర సహాయ కార్యదర్శి సిద్ధి వెంకటేశ్వర్లు విగ్రహానికి నివాళులు అర్పించి సిపిఐ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సభలో సాబీర్ పాషా మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం నేటికీ ప్రజలకు స్పూర్తినిస్తోందని, దున్నేవాడికే భూమి నినాదం దేశవ్యాప్తం చేసిందని కొనియాడారు. మహత్తరమైన, త్యాగపూరితమైన సాయుధ పోరాటాన్ని మతపోరాటంగా చిత్రీకరిస్తూ నేటి ఆర్ఎస్ఎస్ వారసులుగా ఉన్న బిజెపి లబ్ధిపొందే కుట్ర చేస్తోందని విమర్శించారు.
తెలంగాణ విలీనంకోసం జరిగిన నాటి సాయుధ పోరాటం నుంచి స్వరాష్ట్రంకోసం జరిగిన తొలిదశ, మలిదశ విరోచిత పోరాటాల్లో విజయాలు సాధించిన తెలంగాణ గడ్డపై మతోన్మాదుల అటలు సాగవన్నాడు. ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడంకోసం కమ్యూనిస్టు యోధులు రావినారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దూం మోహియుద్దీన్, బొమ్మగాని ధర్మభిక్షం, చాకలి ఐలమ్మ నేతృత్వంలో ఉద్యమించిన తీరు ప్రతిఒక్కరికి స్పూర్తి అని అన్నారు. తెలంగాణ విముక్తి పోరాటం ప్రపంచ ప్రజా ఉద్యమాలకు ఆదర్శమన్నారు.
రజాకారుల రాచరిక పాలన నుంచి తెలంగాణ ప్రజలను రక్షించేందుకు వందల ఏళ్ల చరిత్ర ఉన్న నిజాం రాజును గద్దె దింపి, నిజాం స్వాధీనంలో ఉన్న తెలంగాణ భూభాగాన్ని భారతదేశంలో అంతర్భాగం చేసింది కమ్యూనిస్టుల ఉద్యమమేనన్నారు. ఆ మహత్తర పోరాటంలో 4500 మంది యువ కమ్యూనిస్టులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగ ఫలితంగానే పది వేల గ్రామాలకు విముక్తి లభించిందని అన్నారు. పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ చేశారని, ఇంత పెద్ద మొత్తంలో భూమిని పంచిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడా లేదని, నాటి రైతాంగ పోరాటంలో పంచిన భూముల్లో నేటి పాలకులు మూడో వంతు కూడా పంచలేదని విమర్శించారు. నాటి సాయుధ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజా పోరాటాలు ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో ఇసుక రేణువంత పాత్ర కూడా బిజెపికి లేదని, ఈ పోరాటాన్ని తామే చేసినట్లుగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అప్పటి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీల నాయత్వంలో భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం, దోరల పెత్తనం అంతంకోసం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం సాగిన పోరాటం నేటితరానికి ఆదర్శమన్నారు.
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు, వీ. పద్మజ, అన్నారపు వెంకటేశ్వర్లు, నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, వరక అజిత్, DHPS జిల్లా అధ్యక్షుడు డి. చెన్నయ్య, ప్రజాసంఘాల నాయకులు కొంగర అప్పారావు, జర్పుల మోహన్, ఉప్పుశెట్టి రాకేష్, గుండాల సుజన్, సత్యనారాయణ, ఎస్.కె. కాసిం, ఎస్.కె. కరీం, బాదావత్ శ్రీను, జర్పుల బాలకృష్ణ, కిషన్, రామకృష్ణ, కమటం ఈశ్వరమ్మ, వడ్లకొండ మేరమ్మ, వగ్గేల పద్మ, రాజేష్, శ్రీను, లాల్ పాషా తదితరులు పాల్గొన్నారు..
Advertising


Post a Comment