జాతీయ లోక్ అదాలత్ కు అనూహ్య స్పందన
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించారు. ఈ లోక్ అదాలత్‌కు కక్షిదారుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 11 బెంచీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈసారి జాతీయ లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. రాజీమార్గంలో కేసుల పరిష్కారంకోసం కక్షిదారులు పెద్ద ఎత్తున ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇందుకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు యంత్రాంగం చేసిన కృషిని కొనియాడారు.
వైవాహిక వివాదాన్ని సామరస్యంతో పరిష్కరించుకొని ఒక్కటైన దంపతులకు అవార్డు అందజేసి అభినందించారు. రాజీమార్గమే రాజమార్గమని, చిన్న తగాదాలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకుని స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూచించారు. కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం కల్పిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు. కక్షిదారులకు పులిహోర, మంచినీటి సదుపాయాన్ని ఎస్‌బిఐ వారి సౌజన్యంతో కల్పించారు.
ఈ కార్యక్రమంలో మెజిస్ట్రేట్లు కె. సాయి శ్రీ, బి. రవికుమార్, వి. వినయ్ కుమార్, స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడి లక్ష్మి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జే. గోపీకృష్ణ, ప్రధాన కార్యదర్శి బాగం మాధవరావు, చీఫ్ డిఫెన్స్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వి. పురుషోత్తం రావు, డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు,జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కిరణ్ కుమార్, సీనియర్-జూనియర్ న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.


Post a Comment