రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని అధికారులపై జర్నలిస్ట్ ఫిర్యాదు

రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం...అధికారులపై జర్నలిస్ట్ ఫిర్యాదు
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీనియర్ జర్నలిస్ట్ రెశ్వంత్ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు ఫిర్యాదు చేశారు.

కొత్తగూడెం పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి కోర్టు, శేషగిరి నగర్ మీదుగా హేమచంద్రపురం వెళ్లే రోడ్డు గత రెండేళ్లుగా దెబ్బతిన్నదని, వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సింగరేణి టిప్పర్లు భారీ లోడుతో రాకపోకలు సాగించడం వల్ల గుంతలు ఏర్పడి పరిస్థితి మరింత దారుణంగా మారిందని తెలిపారు.

స్థానికులు పలుమార్లు ధర్నాలు, రాస్తారోకోలు చేసినా పాలకులు, అధికారులు స్పందించలేదని రెశ్వంత్ ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుని, రోడ్డు నిర్మాణ పనులు తక్షణం చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఈ మేరకు పి.ఎల్.సి. యస్.ఆర్. నెంబర్ 972/2025 గా కేసు నమోదు కాగా, ప్రతివాదులుగా జిల్లా కలెక్టర్, కొత్తగూడెం ఎమ్మెల్యే, సింగరేణి ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, రోడ్డు భవనాల శాఖ డివిజనల్ ఇంజనీర్ లను చేర్చారు.

ఫిర్యాదును స్వీకరించిన జిల్లా న్యాయసేవాధికార సంస్థ, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు.

Blogger ఆధారితం.