ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు – కలెక్టర్ జితేష్ వి. పాటిల్

ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు – కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు మంగళవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రేపు ముఖ్యమంత్రి బెండలపాడు గ్రామంలో జరిగే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుందని తెలిపారు. పెద్ద ఎత్తున పూర్తయిన ఇండ్లలో పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు జరగడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతమైన బెండలపాడు గ్రామం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై అధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గ్రామాన్ని సందర్శించడం విశేషమని అన్నారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. సభా ప్రాంగణానికి వచ్చే లబ్ధిదారులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా రవాణా, త్రాగునీరు, పారిశుధ్యం, వైద్య సహాయం, భద్రత వంటి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. మధ్యాహ్నం 12 గంటలలోపే అన్ని బస్సులు సభా ప్రాంగణానికి చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని, ప్రతి బస్సుకు ఒక ఇన్‌ఛార్జ్‌ను నియమించి లబ్ధిదారులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు.

సభలో అధిక జనసంచారం కారణంగా ఒత్తిడి తలెత్తే అవకాశమున్నందున చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు సభకు రాకుండా చూడాలని సూచించారు. సభ ముగిసిన తరువాత బస్సుల్లో వచ్చిన లబ్ధిదారులు తిరిగి తమ గమ్యస్థానాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేరుకునే వరకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

జిల్లా గౌరవానికి అనుగుణంగా ముఖ్యమంత్రి పర్యటన అత్యంత పకడ్బందీగా, విజయవంతంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


Advertising:



Blogger ఆధారితం.