కరకవాగులో SBI జన్ సురక్ష క్యాంప్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలం కరకవాగు గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిన్నెరసాని శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జన్ సురక్ష క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.బి.ఐ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవిత జ్యోతి భీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) లు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప భీమా పథకాలని పేర్కొన్నారు.
ప్రతి ఏటా కేవలం రూ.436 చెల్లించి జీవిత భీమా, రూ.20 చెల్లించి ప్రమాద భీమా పొందవచ్చని ఆయన వివరించారు. ఈ పథకాలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్బిఐ శాఖలలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రజల్లో బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు ప్రతి గ్రామపంచాయతీలో జన్ సురక్ష క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. బ్యాంకింగ్ సేవల వినియోగం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు ఆర్థికంగా స్థిరపడాలని ఆయన ఆకాంక్షించారు.
ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తలు, KYC నవీకరణల ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు. జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ భీమా చేయించాలన్న లక్ష్యంతో అన్ని శాఖలు కలిసికట్టుగా పని చేస్తున్నాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో SBI మేనేజర్ రాజబాబు, కిన్నెరసాని శాఖ మేనేజర్ వెంకట రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, భాను పద్మశ్రీ, సి.యస్.పి జిల్లా కోఆర్డినేటర్ కిషోర్, సి.యస్.పిలు పాటిబండ్ల అభినవ్, రాము, రవి, చంద్రకళ, సి.ఎఫ్.ఎల్. కౌన్సిలర్లు నవీన్, అంబేద్కర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment