ప్రజా కళారూపాలే ప్రజల్లో చైతన్యం కలిగిస్తాయి - వేముల కొండలరావు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ప్రజలు నిత్యం పాడుకునే పాటలు, జానపద కళారూపాలే ప్రజల్లో గొప్ప చైతన్యం కలిగిస్తాయని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు అన్నారు. మంగళవారం పాల్వంచ పట్టణంలోని చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి పాటల శిక్షణ శిబిరం నిర్వహించారు. ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు శనిగరపు శ్రీనివాసరావు అధ్యక్షతన, కార్యదర్శి కాటూరి రాము నేతృత్వంలో ప్రారంభమైన శిక్షణ శిబిరానికి 23 మంది కళాకారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ దేశంలో ప్రజానాట్య మండలి (ఇప్టా) పేరుతో 1943 సంవత్సరంలో బొంబాయిలో ప్రారంభమై స్వాతంత్రం కోసం జరిగిన అనేక ఉద్యమాలలో వివిధ రాష్ట్రాల్లో కళారూపాలతో ప్రజలను చైతన్య పరచిందని తెలిపారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేసిందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన రైతు మహా ఉద్యమంలో ఇప్టా కళా ప్రదర్శనలతో కార్యక్రమాలు నిర్వహించిందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో శిక్షకులుగా సీనియర్ కళాకారులు కె. రాందాస్, పాల్వంచ మండల అధ్యక్ష కార్యదర్శులు నిమ్మల రాంబాబు, కేలోత్ కృష్ణ, స్వరూప, కొమరయ్య, లక్ష్మి, రాజేశ్వరి, సంజీవరావు, సత్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment