అర్హులైన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉండాలి: జిల్లా కలెక్టర్

అర్హులైన ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలు గా ఉండాలి: జిల్లా కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  మహిళల ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధనలో భాగంగా జిల్లాలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం క్రింద అర్హులైన మహిళలు, వృద్ధ మహిళలు, దివ్యాంగులు మరియు కిశోర బాలికలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు మంగళవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాలలో లేని అర్హులైన గ్రామీణ మహిళలను గుర్తించి, వారిని SERP ఆధ్వర్యంలో ఋణ సౌకర్యాలు, జీవనోపాధి అవకాశాలు, చిన్నతరహా వ్యాపారాల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలకు అనుసంధానించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే కాకుండా, గ్రామీణ సమాజంలో వారి స్థానాన్ని మరింత బలపరచాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు.

అందులో భాగంగా 60 ఏళ్లు పైబడిన వృద్ధ మహిళలతో 10–15 మంది సభ్యుల వృద్ధ స్వయం సహాయక సంఘాలు, దివ్యాంగులతో 5–15 మంది సభ్యుల ప్రత్యేక సంఘాలు, అలాగే 15–18 సంవత్సరాల వయస్సు గల కిశోర బాలికలతో 10–15 మంది సభ్యుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సంఘాల ద్వారా వారికి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాయం, శిక్షణ వంటి సదుపాయాలను అందించి, వారిని సమాజంలో మరింత చురుకుగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి గ్రామ స్థాయి సహాయక సిబ్బంది, సీసీలు, ఎంఎస్‌ఓబీలు చురుకుగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి అర్హురాలికి ఈ పథకం గురించి అవగాహన కల్పించడంతో పాటు, సంఘాలలో చేరడానికి అవసరమైన సదుపాయాలను అందించేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు.

ఈ సదస్సులో డీఆర్‌డీవో విద్యా చందన, అదనపు డీఆర్‌డీవో నీలేష్, మహిళా శిశు సంక్షేమ అధికారి శ్. స్వర్ణలత లెనినా, ఎల్‌డీఎం రామిరెడ్డి, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ అనిల్, జీఎం (జీఐసీ), జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, ఎంఎస్‌ఓబీలు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.