మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం IDOC కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదవుతున్న NDPS కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదకద్రవ్యాల వాడకం, నియంత్రణ చర్యలు, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై చేయాల్సిన విస్తృత ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని సూచించారు.
జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, మోడల్ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో డ్రగ్స్, మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై వైద్య అధికారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
మాదకద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి, అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా అవసరమైన వారికి చికిత్స అందించాలన్నారు.
అటవీ శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని చెప్పారు.
జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని కలెక్టర్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు. ఇంటర్ కళాశాలల్లో మాదకద్రవ్యాల వినియోగం వల్ల జరిగే నష్టాలపై అవగాహన కల్పించేందుకు ఈ వారంలో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
అనంతరం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విద్యార్థులకు, యువతకు, ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థల్లో యాంటీ-ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి, ర్యాగింగ్‌ను మొదటిదశలోనే కట్టడి చేయాలని సూచించారు. కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థుల అలవాట్లు, నడవడికను ఎప్పటికప్పుడు గమనించాలని అన్నారు.
ఈ సమావేశంలో ZPC EO నాగలక్ష్మి, ఇంటర్మీడియట్ అధికారి వేంకటేశ్వరరావు, జిల్లా వైద్యశాఖ అధికారి జయలక్ష్మి, రవాణా శాఖ అధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment