పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శుక్రవారం మణుగూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల, తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల, వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తరగతి గదులు, భోజనశాల, వసతి గృహాలు, పాఠశాల పరిసరాలను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు. వసతి సౌకర్యాలు, పరిశుభ్రత, త్రాగునీరు, మంచం, దుప్పట్లు, స్నానాల గదులు వంటి అంశాలపై విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
తరగతి గదుల్లో విద్యార్థుల చదువు, ఉపాధ్యాయుల బోధన నాణ్యత, అభ్యాస స్థాయి పై సమీక్ష నిర్వహించిన ఆయన, విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠ్యబోధనతో పాటు పోటీ పరీక్షల శిక్షణనూ అందించాలని మార్గనిర్దేశం చేశారు.
భోజనశాల తనిఖీ సందర్భంగా ఆహార పదార్థాల నిల్వ, వంటశాల శుభ్రత, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను పరిశీలించారు. తాజా పదార్థాలతో వంట చేయాలని, పోషకాహారంతోనూ రుచికరంగానూ భోజనం ఉండేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు కోసం నాణ్యమైన విద్య అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. వసతి, భోజనం, శుభ్రత, భద్రతపై అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. విద్యార్థులు పుస్తకాలతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనబరచేందుకు అవకాశాలు కల్పించాలని సూచించారు. పాఠశాలల సమస్యలపై నివేదికలు అందిస్తే తక్షణమే పరిష్కారం చూపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

Post a Comment