న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలి : ఐఎల్‌పీఏ జిల్లా కన్వీనర్ గోపి కృష్ణ
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఎన్రోల్ అయిన న్యాయవాదులందరికీ వెంటనే హెల్త్ కార్డులు అందజేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్‌పీఏ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ జనపరెడ్డి గోపి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం కొత్తగూడెం పట్టణంలోని ఐఎల్‌పీఏ జిల్లా కార్యాలయంలో న్యాయవాది యర్రపాటి కృష్ణ అధ్యక్షతన క్రియాశీలక సభ్యుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గోపి కృష్ణ మాట్లాడుతూ న్యాయవాదులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ద్వారా అందజేస్తున్న హెల్త్ కార్డులు 2019 తర్వాత ఎన్రోల్ అయిన న్యాయవాదులకు ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. దీంతో గత ఆరు సంవత్సరాలుగా కొత్తగా ఎన్రోల్ అయిన న్యాయవాదులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని వెంటనే పరిష్కారం చూపాలని ఆయన కోరారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా న్యాయవాదుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అన్ని కోర్టుల్లో ఈ వారం లోపల కొత్త కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు గోపికృష్ణ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎల్‌పీఏ బాధ్యులు న్యాయవాదులు యర్రపాటి కృష్ణ, అంబటి రమేష్, డి.సామంత్, మహమ్మద్ సాదిక్ పాషా, యస్.భానుప్రియ, మారపాక రమేష్, కాకాటి నీలివేణి, నందిని, అంకుష్ పాషా, థరావత్ రాధకృష్ణ, బేబీ షామిలి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment