గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ
జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ ఉదృతంగా ప్రవహిస్తోంది. కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీస్ శాఖ ఇతర శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని పేర్కొన్నారు.
ఉదృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకల వద్దకు వీడియోల కోసం, సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసుల సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Post a Comment