రైతులకు సరిపడా యూరియా తక్షణమే అందించాలి - ముత్యాల విశ్వనాథం

 

రైతులకు సరిపడా యూరియా తక్షణమే అందించాలి - ముత్యాల విశ్వనాథం

జె.హెచ్.9.మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియాను తక్షణమే అందించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం AIKS జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రైతు సంఘం రాష్ట్ర పిలుపులో భాగంగా యూరియా కొరతను తక్షణమే నివారించాలని డిమాండ్ చేస్తూ గురువారం పట్టణంలోని చంద్ర రాజేశ్వరరావు భవన్ నుండి రైతులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసిల్దార్ దారా ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు.



ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతు వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు ఇతర పంటలు విస్తృతంగా సాగు చేస్తున్న క్రమంలో సీజన్ ప్రారంభమై మధ్యకు చేరుకున్న పంటలకు సరిపడా యూరియా అందించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంపై నరేంద్ర మోడీ సవితి తల్లి ప్రేమ వలన ఈ రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తమ అనుకూల రాష్ట్రాలకు సరిపడా యూరియాను సరఫరా చేసి తెలంగాణ రాష్ట్రానికి కోత విధించడం సరైనది కాదన్నారు. రైతులు సాగు ప్రారంభించి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేస్తున్నారని ఇటువంటి సమయంలో యూరియా అందకపోతే రైతులు నష్టాలకు గురై అప్పుల ఊబిలో కూరకపోయే ప్రమాదం ఉందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని రాష్ట్రానికి కేటాయించిన పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది పురుగు మందుల దుకాణదారులు తమ ఇష్టానుసారంగా అధిక రేట్లకు యూరియాను అమ్ముతూ రైతులను దోచుకుంటున్నారని, అధిక రేట్లకు అమ్ముతూ రైతులను దోచుకుంటున్న దుకాణాలపై వ్యవసాయ శాఖ అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లా రైతాంగానికి సరిపడా యూరియా అందించకుంటే జిల్లా వ్యాప్తంగా రైతులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాట రూపకల్పన చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో BKMU జిల్లా అధ్యక్షులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, పాలఉత్పత్తిదారుల సంఘం జిల్లా నాయకులు గుండాల నాగరాజు, రైతు సంఘం నాయకులు నిమ్మల రాంబాబు, ఇట్టి వెంకట్రావు, శనగారపు శ్రీనివాసరావు, వైయస్ గిరి, డి చెన్నయ్య, మన్నెం వెంకన్న, నరహరి నాగేశ్వరరావు, కొంగర అప్పారావు, బానోత్ రంజిత్, గాజుల సత్యనారాయణ, పోలబోయిన వెంకటేశ్వర్లు, జార్పుల మోహన్, బాదావత్ శీను, నిట్ట అమృతరావు, చల్లా కృష్ణ, జక్కుల సురేష్, ఎడవల్లి కృష్ణ, చంచలపురి శ్రీను, సాయిలు వెంకన్న, లావుడియా చందూలాల్, సీతారం, బాలాజీ, లాల్ సింగ్, కరీం, లక్ష్మీ, పద్మ, రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.