స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ప్రగతి మైదానంలో ప్రధాన వేదిక, సీటింగ్, అతిథుల వసతులు సక్రమంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం దృష్ట్యా వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. వేడుక ప్రాంగణంలో 108 అంబులెన్స్, వైద్య బృందాలను సిద్ధంగా ఉంచి, అవసరమైన మందులు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖకు ఆదేశించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని, అలాగే వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, అటవీ, విద్య, వైద్యం, పంచాయతీ రాజ్, ఆర్టీసీ తదితర శాఖల పనితీరును ప్రతిబింబించే స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం అధికార అతిథులకు ఆహ్వానాలు పంపించడంతో పాటు, జాతీయ పతాకం గౌరవానికి భంగం కలగకుండా అన్ని ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థుల ద్వారా దేశభక్తి గీతాలు, నృత్యాలు, నాటికలు నిర్వహించి జాతీయ భావన పెంపొందించాలని కలెక్టర్ సూచించారు. ప్రశంసా పత్రాల బహూకరణ కోసం శాఖల వారీగా ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగుల పేర్లను నిర్ణీత గడువులోపు సమర్పించాలన్నారు.
అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విజయవంతంగా సాగేందుకు కృషి చేయాలని, జిల్లా ప్రజల్లో జాతీయ భావన పెంపొందేలా వేడుకలు నిర్వహించాలన్నది కలెక్టర్ ఆదేశించారు.
ఈ సన్నాహక సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Post a Comment