విద్యార్థులకు చదువుతోపాటు మంచి ఆరోగ్యం కూడా ముఖ్యం – కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: విద్యార్థుల విద్యా ప్రగతికి శారీరక, మానసిక ఆరోగ్యం కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. అంతర్జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా సోమవారం పాల్వంచ, బొల్లారుగూడెంలోని మైనారిటీ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావుతో కలిసి ముఖ్య అతిథిగా కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటేనే చదువులో పూర్తి స్థాయి దృష్టి పెట్టగలరని, అందుకే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రాధాన్యత వహిస్తోందని తెలిపారు. నులిపురుగులు శరీరంలో ఉండటం వలన పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, ఆకలి తగ్గడం, అలసట, కడుపు నొప్పి, వికారం, విరోచనాలు, బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని, ఇవి వారి శారీరక ఎదుగుదల, చదువులో ఏకాగ్రత, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వివరించారు.
ఈ సమస్యలను నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం విజయవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆల్బెండజోల్ మాత్రలు నులిపురుగులను పూర్తిగా నిర్మూలించడంలో, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
జిల్లా వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 3,36,136 మంది పిల్లలు, యువతకు ఈ మాత్రలు అందించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వైద్య ఆరోగ్య శాఖతో పాటు అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రతి పాఠశాల, వసతి గృహం, అంగన్వాడీ కేంద్రం, కళాశాలలో ఈ మాత్రలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నులిపురుగుల నివారణ మాత్రల వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో పాటు, ఎలాంటి అపోహలు పెట్టుకోకూడదని ప్రజలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కోరారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు ఇవ్వాలని,
1–2 సంవత్సరాల వయస్సు పిల్లలకు సగం మాత్ర, 2–19 సంవత్సరాల వారికి పూర్తి మాత్ర నమిలి మింగేలా చేయాలని సూచించారు.
ఆగస్టు 18 వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 19 ఏళ్ల లోపు ప్రతి ఒక్కరికి మాత్రలు అందించడానికి సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. నులిపురుగులు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రధాన కారణమని, వాటి నివారణ ద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా, చదువులో ప్రతిభ కనబరుస్తారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జయలక్ష్మి, సిపిఓ సంజీవరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, బోధక సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post a Comment