కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు.
తరగతి గదిలో విద్యార్థులతో మమేకమై, వారికి అందుతున్న సదుపాయాలు, విద్యాబోధన, ఏమైనా సమస్యలు ఉన్నాయా? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అంటూ పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ "వెనుకబడిన ప్రాంతాల్లో బాలికలకు సమగ్ర విద్యను అందించడంలో కస్తూరిబా బాలికల విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన వసతులు, భద్రతా ప్రమాణాలు, ఆరోగ్యకరమైన ఆహారం కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రతి విద్యార్థి చదువులో ఉన్నత స్థాయికి చేరేందుకు అవసరమైన పరిసర వాతావరణం పాఠశాలలో ఉండాలి. మౌలిక వసతుల కల్పనలో రాజీ పడరాదు" అని కలెక్టర్ స్పష్టం చేశారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, విద్యార్థులకు మంచి, రుచికరమైన భోజనం అందించాల్సిందిగా ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం తప్పకుండా అందించాలన్నారు.
పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు, ఉసిరి మొక్కలను విస్తృతంగా నాటాలన్నారు. విద్యార్థులకు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించాలని సూచించారు.
పాఠశాలల్లో మురుగునీరు బయటకు వెళ్లేందుకు వీలుగా డ్రైనేజీ నిర్మించాలని, దీనివల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలన్నారు.
అనంతరం కలెక్టర్ కరకగూడెంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాలలో ఏర్పాటు చేసిన తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ విద్యా సంవత్సరంలో నవోదయ పాఠశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మండల విద్యాశాఖ అధికారి మంజుల, తహసీల్దార్ ఘంటా ప్రతాప్, డిప్యూటీ తహసీల్దార్ కాంతారావు, పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఆర్‌ఐ కృష్ణ ప్రసాద్, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment