హత్య కేసులో వ్యక్తికి జీవిత ఖైదు
కేసు వివరాలు ఇలా... దమ్మపేట మండలానికి చెందిన వట్టి నాగేశ్వరరావు తన ఏకైక కుమార్తె వెంకటలక్ష్మి అలియాస్ సుధను మంగపేట మండలం తిమ్మంపేటకు చెందిన బత్తుల శ్రీనివాస్ (ప్రస్తుతం మణుగూరు సుందరయ్య నగర్ నివాసి)తో 16 సంవత్సరాల క్రితం కట్న కానుకల ఇచ్చి వివాహం చేశారు. వీరికి ప్రస్తుతం 15 ఏళ్ల కుమారుడు బత్తుల కార్తీక్ ఉన్నాడు.
వివాహం అనంతరం రెండేళ్లకే శ్రీనివాస్, అతని అక్క కుక్కునూరి సావిత్రి కలిసి పెళ్లి సమయంలో ఇచ్చిన రెండు ఎకరాల భూమిని అమ్మి డబ్బులు తేవాలని వెంకటలక్ష్మిని వేదించడం మొదలు పెట్టారు. పలుమార్లు ఆమెను శారీరకంగా హింసించి, చేయి విరగకొట్టి ఇంటికి పంపిన సందర్భం కూడా ఉంది. ఆ సమయంలో బాధితురాలు ఫిర్యాదు మేరకు దమ్మపేట పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ ఇచ్చినా... శ్రీనివాస్ ప్రవర్తనలో మార్పు రాలేదు.
శ్రీనివాస్ వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకొని ఇంటికి రావడం మానేశాడు. దీంతో వెంకటలక్ష్మి తన కుమారుడు కార్తీక్‌తో కలిసి కొంతకాలం తండ్రి ఇంటిలోనే ఉండేది. పెద్దల సమక్షంలో కాపురం సాగిస్తానని హామీ ఇచ్చిన శ్రీనివాస్ కొద్ది రోజులకే మళ్లీ అలానే ప్రవర్తించడం ప్రారంభించాడు.
ఈ నేపథ్యంలో 2020 సెప్టెంబర్ 10న "నువ్వు బ్రతికి ఉన్నంతవరకూ నాకు శాంతి ఉండదని" కార్తీక్ ఎదుటే గొడవ పడ్డాడు. అదే రాత్రి 11 సెప్టెంబర్ తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఇంట్లో ఉన్న పొడవైన కత్తితో వెంకటలక్ష్మి గొంతు వద్ద, మెడపై రెండుసార్లు తీవ్రంగా గాయపరిచి, ఆమెను హత్య చేశాడు. బాధితురాలు మంచంపైనే రక్తమడుగులో మృతిచెందింది. ఈ దృశ్యాన్ని గమనించిన కుమారుడు కార్తీక్ అటు చుట్టుపక్కల వారికి, ఇటు పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.ఏ. షుకూర్ మొదటిగా కేసు దర్యాప్తు ప్రారంభించగా, ఆ తరువాత సీఐ ఆర్. భాను ప్రకాష్ కేసును విచారించి 1) బత్తుల శ్రీనివాస్ 2) కుక్కునూరి సావిత్రిపై కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కేసులో మొత్తం 13 మంది సాక్షుల వాంగ్మూలాలను కోర్టు పరిశీలించింది. ఇరుపక్షాల వాదన విన్న అనంతరం ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఇందులో బత్తుల శ్రీనివాస్‌నే ప్రధాన నిందితుడిగా నిర్ధారించారు. అతనిపై IPC సెక్షన్ 498A కింద మూడేళ్ల కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా, IPC సెక్షన్ 302 (హత్య) కింద జీవితఖైదు శిక్షతో పాటు మరో రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ రెండు శిక్షలు ఒకేసారి అనుభవించాల్సిందిగా పేర్కొన్నారు. రెండవ నిందితురాలు కుక్కునూరి సావిత్రిపై నిర్దోషిగా విడుదల చేశారు.
ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ బాధ్యతలను పి.వి.డి. లక్ష్మి నిర్వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్ కుమార్, లైజన్ ఆఫీసర్ ఏన్. వీరబాబు, కోర్టు డ్యూటీ పీసీ అశోక్‌లు సహకారం అందించారు.

Post a Comment