బాలికను కొట్టిన తండ్రిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాం – CWC సభ్యుడు సాదిక్ పాషా
ఈ సందర్భంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యుడు మహమ్మద్ సాదిక్ పాషా మాట్లాడుతూ బూర్గంపాడు మండలం సారాపాక గ్రామానికి చెందిన మిర్యాల రమేష్ అనే వ్యక్తి తన 8 ఏళ్ల కూతురిని కొట్టినట్లు సమాచారం అందిందని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కమిటీ ఆదేశాల మేరకు సాదిక్ పాషాతో పాటు హెల్ప్‌లైన్ 1098 కోఆర్డినేటర్ బానోత్ సందీప్, కేస్ వర్కర్ జి. భవాని, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ పీవో ఎన్.ఐ.సి. అదూరి శేషయ్య, అవుట్ రీచ్ వర్కర్ ఎస్. లతా, ఐసిడీఎస్ సూపర్వైజర్ సక్కుబాయి బాలిక ఇంటికి వెళ్లినట్లు తెలిపారు.
అయితే బాలిక తన తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటికి కురివి గ్రామానికి వెళ్లినట్లు తెలిసిందని పేర్కొన్నారు. వెంటనే బాలికతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్నామని, తండ్రిపై పోలీసు కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చామని సాదిక్ పాషా వెల్లడించారు.
ఈ మేరకు సూపర్వైజర్ సక్కుబాయి బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, సబ్ ఇన్‌స్పెక్టర్ మేడ ప్రసాద్ ఫిర్యాదును స్వీకరించి క్రైం నెంబర్ 206/2025 కింద కేసు నమోదు చేశారని తెలిపారు.
"18 ఏళ్ల లోపు పిల్లలను కొట్టడం, వారిపై దౌర్జన్యం చేయడం, బాల్యవివాహాలు చేయడం, బాలలతో పని చేయించడం నేరం. ఇలాంటి ఘటనలు ఎవరైనా చూశారంటే వెంటనే 1098కి కాల్ చేయాలి. కాల్ చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి," అని సాదిక్ పాషా తెలిపారు.

Post a Comment