బాబాయ్‌ను గాయపరిచిన కేసులో అబ్బాయికి జైలు శిక్ష
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: బాబాయ్‌ను గాయపరిచిన కేసులో అబ్బాయికి జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కె. కిరణ్ కుమార్ శుక్రవారం తీర్పు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే 2022 ఫిబ్రవరి 21న సాయంత్రం 5 గంటల సమయంలో పాల్వంచ మండలం పాండంగాపురానికి చెందిన మైనేని వెంకటేశ్వరరావు తన పొలంలో నీళ్లు పెడుతూ ఉన్నాడు. అదే సమయంలో వారసత్వ స్థలాల విషయంలో గతంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న అతని అన్న కొడుకు మైనేని ఉదయభాస్కర్, వెంకటేశ్వరరావు ఒంటరిగా ఉన్న సమయంలో దాడికి దిగాడు. కర్రతో తలపై, మూతిపై, కాళ్లపై కొట్టి తీవ్ర గాయాలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై అన్నారప్పాడు గ్రామానికి చెందిన బాధితుడి కుమార్తె దుగ్గిని ఉష పాల్వంచ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అప్పటి సబ్ ఇన్‌స్పెక్టర్ కె. సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించారు. అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
కేసు విచారణ సందర్భంగా మొత్తం 12 మంది సాక్షులను పరిశీలించిన కోర్టు, ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం నిందితుడు మైనేని ఉదయభాస్కర్‌కు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనలను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కారం రాజారావు ప్రాతినిధ్యం వహించారు. కోర్టు నోడల్ ఆఫీసర్ ఎస్‌ఐ.జి ప్రవీణ్ కుమార్, లైజాన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ పీసీ వెంకటేశులు కేసు నడిపించడంలో సహకరించారు.

Post a Comment