జగన్నాథపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

 

జగన్నాథపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: పాల్వంచ మండలంలోని జగన్నాథపురం గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను , ఓపీ, రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్‌పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ గదులను పరిశీలించారు.

ఆనంతరం ఆసుపత్రిలో విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్‌తో పాటు ఇతర సిబ్బంది హాజరును పరిశీలించి, విధి నిర్వహణ పట్ల అలసత్వం ప్రదర్శించకుండా ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులను పర్యవేక్షిస్తూ వారికి అందుబాటులో ఉన్న మందుల గురించి తెలుసుకున్నారు. రోగులతో ప్రత్యక్షంగా మట్లాడి, వారికి అందుతున్న వైద్య సేవలు, వైద్యులు అందుబాటులో ఉన్నారా? మందులు ఇస్తున్నారా? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఆనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధుల్లో నిబద్ధత చూపాలని ఆదేశించారు. అన్ని రకాల అవసరమైన మందులు, వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా స్టాక్ పూర్తయ్యేలోపే ముందుగానే ఇండెంట్ చేసి తెప్పించుకోవాలని సూచించారు. ఎక్స్‌పైర్ అయ్యే ఔషధాలపై అప్రమత్తంగా ఉండాలని, అవి ఆసుపత్రిలో నిల్వ ఉండకూడదని స్పష్టం చేశారు.

ప్రత్యేకంగా వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, వైరల్ ఫీవర్ల చికిత్సకు అవసరమైన మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని సూచించారు. గర్భిణీల వివరాలు నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ తనిఖీలో కలెక్టర్ వెంట డాక్టర్ రాజు, సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.