మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
ఈ సందర్భంగా కలెక్టర్, గ్రిడ్ నుండి నీటి ప్రవాహం, నిల్వ సామర్థ్యం, రోజువారీ మండల డిమాండ్, గ్రామాల వారీగా నీటి సరఫరా స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్లాంట్‌లో అమలవుతున్న వివిధ దశల నీటి శుద్ధి ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ప్రతి దశలో చేపడుతున్న పరీక్షలు, శుద్దీకరణ విధానాలు, ల్యాబ్ పరీక్షల ప్రమాణాలను గురించి అధికారులను సమగ్రంగా ప్రశ్నించారు. ప్లాంట్ నిర్వహణలో ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలు, ఫిల్టర్ల పనితీరు, కెమికల్ డోసింగ్ వంటి అంశాలను కూడా పర్యవేక్షించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీటి కాలుష్యం అధికమయ్యే అవకాశముండటంతో, తగిన శుద్ధి పరీక్షలు నిర్వహించి పరిశుభ్రమైన నీటిని సరఫరా చేయాలని సూచించారు. వాటర్ ఫిల్టర్ బెడ్ భవనం పైభాగంలో సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్లాంట్ ఆవరణంలో ఖాళీ ప్రదేశాన్ని వినియోగించి ఆదాయం అందించే మొక్కలు నాటాలని కూడా అధికారులకు సూచించారు.

Post a Comment