ఎన్నికల పిటిషన్ డిస్మిస్..హర్షం వ్యక్తం చేసిన న్యాయవాదులు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కొత్తగూడెం న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఏఎల్) ఆధ్వర్యంలో కోర్టు ఆవరణలో స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఐఏఎల్ నేతలు భాగం మాధవరావు, కోటంరాజు, మునిగడప వెంకటేశ్వర్లు, ఉప్పు శెట్టి సునీల్‌లు మాట్లాడుతూ – “నిజం నిప్పులాంటిది, చివరికి విజయం సాధించింది” అని అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రజలు ఇచ్చిన తీర్పును జీర్ణించుకోలేక కొందరు కుట్రదారులు దాఖలు చేసిన పిటిషన్ చెల్లుబాటు కాలేదన్నారు. ప్రజల ఓటు పవిత్రమైందని, ప్రజల తీర్పును అపహాస్యం చేయడం సరికాదని వారు పేర్కొన్నారు.
ఈ కేసులో హైకోర్టులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జి. విద్యాసాగర్, ఐఏఎల్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మగాని ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యలమోలు ఉదయ భాస్కర్ రావు, రమేష్ కుమార్ మక్కాడ్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Post a Comment