పొగాకు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి – న్యాయమూర్తి సరిత

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ – హైదరాబాద్ వారి ఆదేశానుసారం, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా కోర్టు సమావేశ మందిరంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, కోర్ట్ డ్యూటీ పోలీసుల చేత మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పొగాకు వాడకంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, అందువల్ల పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించారు. పొగాకు వాడకానికి సంబంధించిన దుష్ప్రభావాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
యువత పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా చూసేందుకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి అలవాట్లను గమనించాలని ఆమె అన్నారు. పొగాకు, సిగరెట్, ఆల్కహాల్ వాడకం వల్ల గుండె జబ్బులు, నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధులు కలుగుతాయని, వీటి వాడకం వల్ల శరీర బలహీనత, వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె. కిరణ్ కుమార్, కొత్తగూడెం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్, కొత్తగూడెం స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి, స్పెషల్ పి.పి. వి. నాగిరెడ్డి, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, న్యాయవాదులు, ఏవోజె కిరణ్ కుమార్, న్యాయశాఖ ఉద్యోగులు, కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
Post a Comment