చెక్కు బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్‌ ను సద్వినియోగం చేసుకోండి – జిల్లా జడ్జి

చెక్కు బౌన్స్ కేసుల ప్రత్యేక లోక్ అదాలత్‌ ను సద్వినియోగం చేసుకోండి – జిల్లా జడ్జి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, వ్యక్తుల చే దాఖలైన చెక్కు బౌన్స్ కేసుల తక్షణ పరిష్కారానికి ప్రత్యేక లోక్ అదాలత్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ పాటిల్ వసంత్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 9 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక లోక్ అదాలత్‌లు జరుగనున్నాయని, ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 19వ తేదీ వరకు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ముందస్తు లోక్ అదాలత్ కార్యక్రమాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న చెక్కు బౌన్స్ కేసులు పెద్ద సంఖ్యలో ఉన్న దృష్ట్యా, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ చెక్కు బౌన్స్ కేసులో ఇరువర్గాల్లో ఎవరైనా రాజీకి సిద్ధంగా ఉన్నారని న్యాయ సేవాధికార సంస్థకు తెలియజేస్తే, ఆ కేసు సంబంధిత కోర్టు నుంచి తెప్పించి, ఇరుపక్షాలను లేదా వారి న్యాయవాదులను పిలిపించి మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాజీ ఒప్పందం రాతపూర్వకంగా సిద్ధం చేసి, ఇరుపక్షాలకూ అవార్డు కాపీని తక్షణమే అందజేసే విధంగా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. డబ్బు మొత్తాన్ని తక్షణమే చెల్లించలేని సందర్భంలో, కొన్ని వాయిదాల్లో చెల్లించేలా మధ్యవర్తుల ద్వారా చర్యలు చేపడతామని వెల్లడించారు.

చెక్కు బౌన్స్ కేసుల పరిష్కారానికి ఈ ప్రత్యేక లోక్ అదాలత్‌లు మంచి అవకాశమని, కక్షిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Blogger ఆధారితం.