ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ గా ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా, ఎలాంటి ఆటంకం లేకుండా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమగ్ర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 22 నుండి 27 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయని తెలిపారు. తొలిసంవత్సరం పరీక్షలు ఉదయం 9:00 నుండి 12:00 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 గంటల వరకు నిర్వహించబడతాయని వివరించారు. ఈసారి ఆదివారం కూడా పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
జిల్లాలో మొత్తం 7,635 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వారికి అనుకూలంగా 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు పరీక్షల సమయానికి అనుగుణంగా నడిపేలా ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షా సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. ప్రశ్నపత్రాల రవాణా సురక్షితంగా ఉండేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
విద్యార్థులు పరీక్షలు ప్రారంభమయ్యే సమయానికి ముందు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలంటూ కలెక్టర్ సూచించారు. పరీక్షల అనంతరం జవాబు పత్రాల బండళ్లను పోస్టల్ శాఖ సకాలంలో, భద్రంగా గమ్యస్థానాలకు చేర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి కేంద్రంలో తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, ఫస్ట్ ఎయిడ్ కిట్ వంటి వసతులు ఉండేలా చూడాలని, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను కేంద్రాల్లో నియమించి వైద్య సాయం అందుబాటులో ఉంచాలని వైద్యశాఖ అధికారులకు సూచించారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు అమర్చాలని, జిరాక్స్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేయాలని, 144 సెక్షన్ అమలుచేయాలని, అవసరమైనంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.
అంతేగాక, వేసవి దృష్ట్యా విద్యార్థులకు మంచినీటి సౌకర్యం తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
సమీక్షా సమావేశంలో ఇంటర్మీడియట్ శాఖ అధికారి సిహెచ్. వెంకటేశ్వరరావు, టేకులపల్లి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సులోచన రాణి, డిప్యూటీ డిఎంహెచ్వో జయలక్ష్మి, ఎస్‌బి ఇన్‌స్పెక్టర్ సిహెచ్. శ్రీనివాస్, ట్రాన్స్‌కో ఏఈ చిన్నయాకయ్య, పోస్టల్ శాఖ ఏఎస్పీ, సానిటరీ ఇన్‌స్పెక్టర్ అహ్మద్, జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారి రమణారావు సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post a Comment