ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును  పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోవాలి: అదనపు కలెక్టర్

జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:: జిల్లా ప్రజల నుండి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆదేశించారు.

సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల విజ్ఞప్తులను విని, శాఖల వారీగా అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజల సమస్యలపై సంబంధిత అధికారులతో ప్రత్యక్షంగా చర్చించి, తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.

దివ్యాంగుడికి వాహనం మంజూరు విజ్ఞప్తి:

కొత్తగూడెం గాజులరాజాం బస్తీకి చెందిన వికలాంగుడు ఆగుళ్ల మల్లేశం, వీధి వ్యాపారంతో జీవనం సాగిస్తున్నట్టు తెలిపారు. దివ్యాంగుల కోటాలో వాహనం మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిని డి డబ్ల్యుఒ అధికారికి ఎండార్స్ చేశారు.

 భూమి పట్టాల కోసం విజ్ఞప్తి:

ములకలపల్లి మండలం చాపరాలపల్లి గ్రామానికి చెందిన బానోతు కుటుంబ సభ్యులు, తమ తాతగారి పేరిట ఉన్న సర్వే నెంబర్లు 251, 258 భూమి తమ ఆధీనంలోనే ఉందని, అయినా ఇతరుల పేరిట పట్టాలు మంజూరయ్యాయని తెలిపారు. రైతుబంధు కూడా ఇతరులే పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు చేసిన విజ్ఞప్తిని తహసీల్దార్‌కు ఎండార్స్ చేశారు.

యాసిడ్ దాడి బాధితురాలికి సహాయం విజ్ఞప్తి:

కొత్తగూడెం క్రాస్ రోడ్‌కు చెందిన వాయిలాల రాధిక, 2013లో యాసిడ్ దాడికి గురై అంగవైకల్యం చెందినట్టు తెలిపారు. జీవనోపాధి కోసం బ్యాంకు రుణం మంజూరు చేసి, వ్యాపారం ప్రారంభించేందుకు అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తిని ఓఎస్‌డీకి ఎండార్స్ చేశారు.

చిట్‌ఫండ్ మోసంపై బాధితుల విజ్ఞప్తి:

భద్రాచలంలోని అక్షర చిట్‌ఫండ్ సంస్థపై బాధితులు ఫిర్యాదు చేశారు. అధిక వడ్డీ హామీతో కోట్ల రూపాయలు సేకరించి, ఆ డబ్బులను భూముల కొనుగోలుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. తమ డబ్బులు తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసిన విజ్ఞప్తిని ఎస్పీకి ఎండార్స్ చేశారు.

అటవీశాఖకు కలిపిన భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలన్న విజ్ఞప్తి:

దమ్మపేట మండలం అక్కినేనిపల్లి గ్రామానికి చెందిన రైతులు, 1973కి పూర్వం తమ భూమిని అటవీశాఖ కలిపుకుందని పేర్కొన్నారు. వారసత్వ హక్కు కలిగిన తమ భూమికి బదులుగా ప్రభుత్వ భూమిని కేటాయించాలన్న విజ్ఞప్తిని సమర్పించారు. ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినా, ఇప్పటివరకు భూమి కేటాయించలేదని తెలిపారు. ఈ దరఖాస్తును ఈ సెక్షన్ సూపరింటెండెంట్‌కు ఎండార్స్ చేశారు.

Blogger ఆధారితం.