జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి - జిల్లా జడ్జి

జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి -  జిల్లా జడ్జి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  జూన్ 14న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ అధికారులు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న రాజీ సాధ్యమైన క్రిమినల్, ఈ-పిటి కేసుల వివరాలను పోలీస్ స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించి జిల్లా స్థాయిని మెరుగుపరచాలని అధికారులను కోరారు.

ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులు తమ కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని, ముఖ్యంగా మోటార్ వాహన ప్రమాద బాధితులకు న్యాయం జరగేలా చూడాలని సూచించారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా రాజీ సాధించడం వలన కక్షిదారులకు సమయం మరియు ధనాన్ని ఆదా చేయవచ్చని తెలిపారు. అలాగే ఇన్సూరెన్స్ సంస్థలు పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు.

ఈ లోక్ అదాలత్‌లో క్రిమినల్, సివిల్, మనోవర్తి, మోటార్ వాహన ప్రమాదాలు, బ్యాంకులు, టెలిఫోన్, సైబర్ క్రైమ్ కేసులు పరిష్కారానికి అవకాశం కలుగుతుందని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో కొత్తగూడెం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సాయి శ్రీ, స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ ఊట్కూరు పురుషోత్తమరావు, పిపి పీవీడీ లక్ష్మి, ఏపిపీలు, టూ టౌన్ ఎస్‌హెచ్ఓ టి. రమేష్ కుమార్, జూలూరుపాడు ఎస్‌హెచ్ఓ ఇంద్రసేనారెడ్డి, సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, సీనియర్ న్యాయవాదులు గాదె రామచంద్ర రెడ్డి, ఎస్‌వీ రామారావు, అంబటి రమేష్, వేముల మధుకర్, కోర్టు కానిస్టేబుల్స్, లైజన్ ఆఫీసర్లు అబ్దుల్ ఘని, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.