బెజవాడ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పాల్వంచ క్రీడాకారుల ప్రతిభ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: బెజవాడలో మే 11న నిర్వహించిన బెజవాడ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ పాల్వంచ (ATP) క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెరిశారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన జట్ల మధ్య జరిగిన పోటీల్లో పాల్వంచ ఆటగాళ్లు విశేషంగా రాణించారు.
60+ వయో విభాగంలో అన్నం వెంకటేశ్వర్లు సారథ్యంలోని జట్టు విజేతగా నిలవగా, 40+ విభాగంలో భాస్కర్ రావు, కబీర్దాస్‌ల జట్టు రన్నర్‌అప్‌గా నిలిచింది. అదే విధంగా 30+ విభాగంలో సతీష్, కృష్ణల జట్టు రన్నర్స్‌గా నిలిచి పతకాలు సాధించారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకుడు ఐఆర్టీఎస్ అధికారి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ తమ అకాడమీ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నమెంట్‌కు ఇరు రాష్ట్రాల నుంచి టెన్నిస్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం హర్షకరం అన్నారు. ముఖ్యంగా పాల్వంచ నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ విజయం తమ ప్రాంతానికి గర్వకారణమని తెలిపారు. అసోసియేషన్ తరఫున జూనియర్స్ విభాగంలో 15 నుంచి 20 మంది వరకు క్రీడాకారులు ఉన్నారని, వారిని కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఈ విజయం మరింతగా గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.

Post a Comment