ఏఐ.కే.ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : రైతులకు ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేయాలని, షరతులు లేకుండా రూ.2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (AIKS) రాష్ట్ర ఉపాధ్యక్షులు ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట AIKS రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయానికి వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ చట్టాల అమలుతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. రైతులను రక్షించాలంటే తక్షణమే స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, పంటలకు మద్దతు ధరకు గ్యారంటీ చట్టం తీసుకురావాలని అన్నారు.
మిర్చికి కింటాకు రూ.25 వేల ధర చెల్లించి ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేయాలని, పత్తికి కింటాకు రూ.16 వేల మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా హామీలను పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ, పంటలకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వ్యవసాయ యంత్రాలకు అందుతున్న సబ్సిడీని పునరుద్ధరించాలని, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సబ్సిడీతో యంత్రాలు అందించాలన్నారు. పోడు సాగుదారులైన ఆదివాసీ, గిరిజన రైతులకు భూముల పట్టాలు మంజూరు చేయాలని, ఫారెస్ట్ అధికారుల కవ్వింపు చర్యలను మానుకోవాలని హెచ్చరించారు.
ధర్నాకు జిల్లా అధ్యక్షుడు చండ్ర నరేంద్రే కుమార్ అధ్యక్షత వహించగా, రైతు సంఘం నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, చంద్రగిరి శ్రీనివాసరావు, సలిగంటి శ్రీనివాస్, నారాటి రమేష్, సపవట్ రవి, విజయలక్ష్మి, సుబ్బారెడ్డి, సీతారాం రెడ్డి, కుమారి హనుమంతరావు, వైఎస్ గిరి, గుగులోత్ రామచందర్, భూక్య దసురు, గుండుపిన్ను వెంకటేశ్వర్లు, ఇమ్మానుయేల్, లక్ష్మీపతి, నునావత్ గోవింద్, బండి నాగేశ్వరరావు, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment