చండ్ర రాజేశ్వరరావు ధన్యజీవి - సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : దేశవ్యాప్తంగా భూ పోరాటాలకు శ్రీకారం చుట్టి, నిరుపేద కుటుంబాలకు జీవనోపాది కల్పించిన చండ్ర రాజేశ్వరరావు ధన్యజీవి అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం అన్నారు. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి సందర్భంగా బుధవారం పాల్వంచ పట్టణంలోని చండ్ర రాజేశ్వరరావు భవన్‌లో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ జమీందారి కుటుంబంలో జన్మించి కమ్యూనిస్టు ఉద్యమాలకు ఆకర్షితుడై తన యావదాస్తిని పేదలకు పంపిణీ చేసిన మహానీయుడు చండ్ర రాజేశ్వరరావు అని కొనియాడారు. పేదలకు భూమి దక్కితేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసించిన సిఆర్ దేశవ్యాప్తంగా భూ పోరాటాలకు నాంది పలికారని తెలిపారు.
మహిళలపై దాడులు, అరాచకాలు, ఉద్యమాల అణచివేతకు పాల్పడుతున్న ప్రభుత్వాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో, ఉద్యమాల్లో పాల్గొనే ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆరు దశాబ్దాల క్రితమే జనసేవాదళ్‌ను ఏర్పాటు చేసిన ముందు చూపు ఉన్న మహానేత చండ్ర రాజేశ్వరరావు అని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, నాయకులు అన్నారపు వెంకటేశ్వర్లు, వేములపల్లి శ్రీను, వైఎస్ గిరి, బిక్కులాల్, కొంగర అప్పారావు, చల్లా కృష్ణ, అమృత రావు, ఆదినారాయణ, కృష్ణ, బాలాజీ, రాము, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రామారావు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment