శ్రీరామ నామస్మరణతో మారుమోగిన పాల్వంచ
- వైభవంగా సాగిన శ్రీరామనవమి మహోత్సవాలు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :
"శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననేః"
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పాల్వంచ పట్టణమంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగింది. "శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ..." శ్లోకాలతో భక్తులు పరవశించగా, రామాలయాలు, వీధులు, వేదికలు అన్నీ శ్రీరామ మహోత్సవ వైభవానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలిచాయి. హరినామ సంకీర్తనలు, తీర్థప్రసాదాల పంపిణీ, సీతారాముల కళ్యాణ మహోత్సవాలతో పట్టణం పవిత్ర వాతావరణాన్ని సంతరించుకుంది.
పెద్దమ్మ గుడి వద్ద పానకం పంపిణీ
పెద్దమ్మ గుడి వద్ద భక్తులకు పానకం, మజ్జిగ వంటి తీపి పానీయాలు పంపిణీ చేశారు. శ్రీ కనకదుర్గ ఆలయ నిర్వాహకురాలు రజిని కుమారి ఆధ్వర్యంలో కేపీ జగన్నాథపురం గ్రామస్తులు, వీకేబీ యువజన మిత్ర బృందం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. గంధం నరసింహారావు, కొండం పుల్లయ్య, షణ్ముఖాచారి, సునీల్, వెంకట్ చారి, కుమార్, సందీప్, జయదేవ్ నాయుడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
భజన మందిరంలో అట్టహాసంగా సీతారాముల కళ్యాణం
శాస్త్రి రోడ్డులోని భజన మందిరంలో ఉదయం 7 గంటలకు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వర్తక సంఘం, భజన మందిర భక్తబృందం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దాదాపు 15 వేల మంది భక్తులు హాజరయ్యారు. పానకం, వడపప్పు, తీర్థప్రసాదం, తలంబ్రాలు, అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ నిర్వాహకురాలు రజిని కుమారి, పర్యవేక్షక అధ్యక్షులు చలవాది ప్రకాష్ వివరాలు తెలిపారు. వేదపండితులు ఆనంద్ శర్మ, వంశీకృష్ణాచార్యుల నేతృత్వంలో కళ్యాణం కొనసాగింది. చిన్నారులు ఆకాంక్ష, మోక్షజ్ఞ గానం చేయడం ఆకట్టుకోగా, నాట్యకళాకారిణి జే.సంతోషి మాత నాట్యనిలయం గురువు వరలక్ష్మి శిష్యులతో కలిసి నృత్యసాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు.
రామాలయాల్లో సీపీఐ నేతల సందడి:
పట్టణంలోని భజన మందిరం రామాలయం, సీతారాంపట్నం రామాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా, రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, పట్టణ సహాయ కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, అన్నారపు వెంకటేశ్వర్లు, నేరెళ్ల రమేష్ తదితరులు భక్తులతో కలిసి పూజలు చేశారు. భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ... "ఊరూ వాడా ఒకతాటిపైకి రావడం అభినందనీయం. ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుకలు నిలవాలి" అని పాషా పేర్కొన్నారు.
జనసేన ఆధ్వర్యంలో పులిహోర, పానకం పంపిణీ:
పాల్వంచ అంబేద్కర్ సెంటరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పులిహోర, పానకం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు బ్రహ్మం, మండల అధ్యక్షుడు వేముల కార్తీక్ ఆధ్వర్యంలో వందలాది మంది భక్తులకు ప్రసాదం అందించారు. జనసైనికులు బాలాజీ, సంపత్, రామ్ వర్మ, సాయి, మల్లికార్జున్, రమేష్, చరణ్ భాషా, ఖాసిం ప్రసాద్, సాయి తేజ్, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ ఆలయంలో వనమా రాఘవేంద్రరావు పూజలు:
పాత పాల్వంచలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రరావు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి దర్శనం పొందారు. ఆయన వెంట ఆలయ నిర్వాహకులు సుంకర వీరభద్రరావు, కొండపల్లి ప్రసాద్, కుసుమరాజుల కృష్ణ, నల్లకట్ల నవీన్, మొగిలి రామకృష్ణ, రొయ్యల కృష్ణయ్య, కూర ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment