న్యాయవాదుల సంక్షేమానికి అదనపు నిధులు కావాలి: ఐ.ఎల్.యు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం: న్యాయవాదుల సంక్షేమానికి కేటాయించిన నిధులు సరిపోవడం లేదని, కార్పస్ ఫండ్‌ను రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అందజేయనున్న వినతిపత్రంపై న్యాయవాదుల సంతకాలను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐ.ఎల్.యు) నేతలు సోమవారం కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో సేకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2019 జాబితాల ప్రకారం జారీ చేస్తున్న మెడికల్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డులు ఇప్పటికీ మరణించిన న్యాయవాదుల పేరిట కొనసాగుతుండటంతో, ఇన్సూరెన్స్ కంపెనీ లాభపడుతోందని, జీవించి ఉన్న న్యాయవాదులకు నష్టం జరుగుతోందని విమర్శించారు. ఈ పరిస్థితిని మార్చేందుకు బార్ కౌన్సిల్ నుంచి తాజా జాబితా తెప్పించి, బార్ అసోసియేషన్ల ద్వారా ఖరారు చేసి, మరణించినవారి పేర్లను తొలగించాలన్నారు. అలాగే 2019 తరువాత నమోదు అయిన న్యాయవాదులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు.
ప్రస్తుతం ఉన్న రూ.2 లక్షల బీమా పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచాలని, న్యాయవాదుల తల్లిదండ్రులకు కూడా హెల్త్ కార్డులు వర్తించాలన్నారు. ప్రసవంతో పాటు అన్ని వైద్య చికిత్సలకు హెల్త్ కార్డు వర్తించేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందేలా చూడాలన్నారు. న్యాయవాదుల కుటుంబ సభ్యులందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరారు.ప్రస్తుతం ట్రస్టుకు ఉన్న రూ.100 కోట్ల నిధులపై వచ్చే వడ్డీ, హెల్త్ కార్డుల నిర్వహణకు సరిపోవడం లేదని, మరిన్ని వైద్య సేవలందించాలంటే అదనంగా రూ.400 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎల్.యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మక్కడ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు జె.శివరాం ప్రసాద్, కోర్టు కమిటీ కార్యదర్శి కిలారు పురుషోత్తం రావు, రాష్ట్ర మహిళా కన్వీనింగ్ కమిటీ సభ్యురాలు గాదె సునంద, జిల్లా కమిటీ సభ్యులు అరికాల రవికుమార్, డి.రవికుమార్, కోర్టు కమిటీ సభ్యులు డి.రాజేందర్, సీనియర్ న్యాయవాది వై.వి.రామారావు, న్యాయవాదులు ఏ.పద్మకళ, పగిడిపల్లి రవి, బి.దేవదాసు, వి.రామకృష్ణ, కె.మహేష్ ఆనంద్, డి.సుబ్రమణ్యం, సి.హెచ్.విజయ్ కుమార్, వై.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment