పాల్వంచ లో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం:  మహారాష్ట్ర పూణేకు తరలిస్తున్న భారీ గంజాయి సరఫరాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కానగిరి నుంచి గంజాయిని కొనుగోలు చేసి, భద్రాచలం – పాల్వంచ మీదుగా తరలించేందుకు యత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను  శనివారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం పోలీసులు వల వేసి పట్టుకున్నారు.

పూణే జిల్లాకు చెందిన పింపల్ గాం గ్రామస్తులు సాగర్ హరిదాస్ దోబ్లే, నీలేష్, కిషోర్ అనే వ్యక్తులు తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, కారులో అమర్చి, రాష్ట్రాల మధ్య గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కుట్రపన్నారు. పక్కా సమాచారం ఆధారంగా పాల్వంచ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్  ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం  సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వారి వద్ద నుంచి మొత్తం 51.27 కేజీల గంజాయి, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.28,80,000 సీజ్ చేసిన వాహనం, ఇతర వస్తువుల విలువ కలిపి రూ.50 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ సీఐ సుంకరి రమేష్ వెల్లడించారు.

పాల్వంచలో ఈ తనిఖీలను అసిస్టెంట్ కమిషనర్ గణేష్ ఆదేశాల మేరకు సీఐ రమేష్ నేతృత్వంలో హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకటేష్, విజయ్ కుమార్, ఉపేందర్‌లు విజయవంతంగా నిర్వహించారు. పట్టుబడిన వారిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్ సీఐ ప్రసాద్‌కు అప్పగించి, కోర్టులో హాజరుపర్చనున్నారు.

అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసిన సీఐ రమేష్, సిబ్బందిని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ తెలంగాణ వి బి కమలహాసన్ రెడ్డి ఐపీఎస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఏఈఎస్ తిరుపతి అభినందించారు.


Blogger ఆధారితం.