తునికాకు సేకరణకు టెండర్లు నిర్వహించాలి: న్యూడెమోక్రసీ
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : తునికాకు సేకరణ కోసం ప్రభుత్వం వెంటనే టెండర్లను నిర్వహించాలని, ఒకవేళ టెండర్లు కాంట్రాక్టర్లు వేయకపోతే ప్రభుత్వం స్వయంగా సేకరణ చేపట్టాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఆధ్వర్యంలో డివిజన్ ముఖ్యుల సమావేశం శనివారం పాల్వంచ గాంధీనగర్‌లోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి కామ్రేడ్ ముసలి సతీష్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గౌని నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, వేసవి కాలంలో ఏజెన్సీ ప్రాంత గిరిజనుల జీవనాధారమైన తునికాకు సేకరణపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టెండర్ల ప్రక్రియ ఆలస్యం చేయకుండా తక్షణమే నిర్వహించి, తునికాకు మోడెం కొట్టించాలని (ప్రూనింగ్ పనులు) డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న బోనస్‌ను వెంటనే విడుదల చేయాలని, సేకరణ ప్రక్రియ ప్రజలకు నేరుగా లాభం చేకూరేలా డబ్బులు వారి చేతికే ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
సమావేశంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్‌కే ఉమర్, జిల్లా, డివిజన్ నాయకులు వెంకటేశ్వర్లు, రాంబాబు, రెడ్డి, రాఘవులు, నాగరాజు, సోమ వినోద్, సమ్మక్క, నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment