ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు – కలెక్టర్

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు –  కలెక్టర్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  జిల్లాలో ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని, సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు.

ప్రధానంగా వచ్చిన ఫిర్యాదులు:

1. వృద్ధాప్య పింఛన్ మంజూరు

లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన వనపర్తి వీరభద్రం (68) తనకు వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయాలని కోరారు. కుటుంబం గడవడం కష్టంగా ఉందని తెలిపారు. ఆయన దరఖాస్తును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఓకు సూచించారు.

2. శ్రీనగర్ కాలనీలో కల్వర్టు నిర్మాణం

పాల్వంచ శ్రీనగర్ కాలనీలో రెండు వైపులా సిమెంట్ రోడ్లు నిర్మించినప్పటికీ,  కల్వర్టు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివాసితులు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ ఏఈ ఇప్పటికే స్థల పరిశీలన చేసినప్పటికీ, పనులు ప్రారంభం కాకపోవడంతో, మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తును ఎండార్స్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

3. నష్టపరిహారం మోసంపై విచారణ

అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టి పంపు గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం మంజూరు చేసింది. అయితే, గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, బ్యాంకు సిబ్బంది కలిసి మోసపూరితంగా నష్టపరిహారం మొత్తాన్ని తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఎండార్స్ చేశారు.

4. పట్టాదారుల పేరిట భూమి మార్పిడి

బూర్గంపాడు మండలం దుర్గంపాడుకు చెందిన తోకల నాగులు, తన తండ్రి తోకల పిచ్చయ్య (మరణించారు) పేరున ఉన్న సర్వే నంబర్ 14/1లో మూడు ఎకరాల 22 కుంటల భూమిని తన పేరిట మార్చాలని దరఖాస్తు చేసుకున్నారు. ఆయన వినతిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారిని ఆదేశించారు.

5. అక్రమ ఆక్రమణలపై ఫిర్యాదు

చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న డేగల తిరుపతి 20 ఏళ్ల క్రితం మణుగూరు సమితి సింగారం గ్రామంలో మూడు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారు. అయితే, కొంతమంది దౌర్జన్యంగా స్థలాన్ని ఆక్రమించడంతో, ఆయన ప్రభుత్వం వద్ద ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి ఎండార్స్ చేశారు.

Blogger ఆధారితం.