నవజాత శిశువును విక్రయించిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కే. సాయి శ్రీ నవజాత శిశువును విక్రయించిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష విధించారు.
కేసు వివరాలు:2016 అక్టోబర్ 7న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో మేదర బస్తీకి చెందిన నందబాల బాల వరలక్ష్మి, నందబాల వెంకటేశ్వర్లు దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. అయితే, అక్టోబర్ 9న బాలుడి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో, భర్త తాగుబోతు కావడం, కుటుంబం పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల వారు శిశువును విక్రయించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో, సిరిసిల్లకు చెందిన గాజుల రవీందర్ బిడ్డను కొనడానికి సిద్ధమయ్యాడు. 80,000 రూపాయల ఒప్పందంతో 50,000 రూపాయలు అడ్వాన్స్‌గా తీసుకొని, మిగతా 30,000 రూపాయలు తరువాత ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పుడే జన్మించిన శిశువును రవీందర్ తీసుకెళ్లిన విషయం వెలుగులోకి రాగా, లక్ష్మీదేవిపల్లె ఐసిడిఎస్ సూపర్వైజర్ పయ్యావుల రమాదేవి 2016 అక్టోబర్ 13న కొత్తగూడెం 3వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అప్పటి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. రాజగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణ అనంతరం కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా, తొమ్మిది మంది సాక్షులను కోర్టు విచారించింది.
నేరం రుజువు కావడంతో నిందితులైన నందబాల బాల వరలక్ష్మి, నందబాల వెంకటేశ్వర్లు, గాజుల రవీందర్‌లకు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.
ఈ కేసులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. విశ్వశాంతి ప్రాసెక్యూషన్ నిర్వహించారు. ప్రస్తుత సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శివప్రసాద్, నోడల్ ఆఫీసర్ జి. ప్రవీణ్ కుమార్, కోర్ట్ లైజాన్ ఆఫీసర్ ఎస్కే. అబ్దుల్ ఘని, కోర్టు డ్యూటీ ఆఫీసర్ బి. శోభన్ సహకరించారు.

Post a Comment