కొత్తగూడెం జిల్లా కోర్టులో వెయిటింగ్ హాల్స్ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి నందా సూరేపల్లి

కొత్తగూడెం జిల్లా కోర్టులో వెయిటింగ్ హాల్స్ ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి నందా సూరేపల్లి
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  కొత్తగూడెం జిల్లా కోర్టు ప్రాంగణంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి నందా సూరేపల్లి ఆదివారం నూతనంగా నిర్మించిన వెయిటింగ్ హాల్స్‌ను ప్రారంభించారు. కోర్టుకు విచారణ నిమిత్తం వచ్చే ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించడానికి, న్యాయ సేవలకు మరింత వృద్ధి కలిగించేందుకు ఈ హాల్స్ ఎంతో ఉపయోగకరమని ఆమె అన్నారు. కోర్టు పనులు పూర్తి అయ్యేంతవరకు కక్షిదారులకు, న్యాయవాదులకు విశ్రాంతి కోసం వీటిని ఏర్పాటు చేయడం గొప్ప ముందడుగుగా అభివర్ణించారు.

ఈ సందర్భంగా జస్టిస్ నందా సూరేపల్లి మాట్లాడుతూ, "న్యాయ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడానికి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఎంతో అవసరం. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వ న్యాయ సేవల సంస్థల భాగస్వామ్యం ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉంది. న్యాయ సేవలను అందుబాటులోకి తేవడంలో, లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషిస్తున్నారు" అని పేర్కొన్నారు.

అంతేకాకుండా, ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలియేషన్ కేంద్రాల ఏర్పాట్ల వల్ల న్యాయ వ్యవస్థపై భారం తగ్గి, కేసుల విచారణ వేగంగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. న్యాయపరమైన వివాదాలను కోర్టు వెలుపల పరిష్కరించేందుకు ఈ విధానాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, ప్రజలు వీటిని ఎక్కువగా వినియోగించుకోవాలని సూచించారు.

కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు పరిధిలోని న్యాయస్థానాల్లో కేసుల విచారణకు వచ్చే పౌరులు, న్యాయవాదులకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ వెయిటింగ్ హాల్స్‌ను నిర్మించారని, న్యాయ సేవల విస్తరణలో ఇదొక ముఖ్యమైన అభివృద్ధి కృషిగా భావించవచ్చని పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిరుదు రాజు రోహిత్ రాజు, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ జి. భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కే. సాయి శ్రీ, భద్రాచలం జూనియర్ సివిల్ జడ్జి శివ నాయక్, మణుగూరు జూనియర్ సివిల్ జడ్జి కె. సూరి రెడ్డి, దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ బి. భవాని తదితరులు పాల్గొన్నారు.

అనంతరం కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ నేతృత్వంలోని న్యాయవాదుల బృందం హైకోర్టు న్యాయమూర్తి నందా సూరేపల్లిని ఘనంగా సత్కరించారు. న్యాయ సేవల్లో మార్పులు తీసుకురావడం, మౌలిక సదుపాయాల పెంపు, ప్రజలకు మెరుగైన న్యాయ సేవలను అందించడానికి తీసుకుంటున్న చర్యలను కొనియాడారు.

ఇందులో భాగంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవల సంస్థ ఆధ్వర్యంలో లీగల్ అవేర్‌నెస్ కార్యక్రమాలు, లీగల్ ఎయిడ్ సర్వీసెస్, పేద ప్రజలకు, మహిళలకు, అవసరమైనవారికి ఉచిత న్యాయ సహాయ కార్యక్రమాలపై చర్చించారు. న్యాయ సేవలు అందరికీ సమానంగా అందాలని, ప్రజలు తమ హక్కులను తెలుసుకుని వాటిని సాధించేందుకు న్యాయపరమైన మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు.

అంతేకాక, జిల్లా న్యాయ శాఖ సిబ్బంది కూడా హైకోర్టు న్యాయమూర్తి నందా సూరేపల్లిని సన్మానించి, న్యాయ వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులకు మద్దతుగా అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్. రవిచంద్ర, కార్యవర్గ సభ్యులు దూదిపాల రవికుమార్, మహమ్మద్ సాదిక్ పాషా, ఎస్. ప్రవీణ్ కుమార్, మహిళా ప్రతినిధి నల్లమల ప్రతిభ, సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాదులు, జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మోహన్ దాస్, జిల్లా న్యాయశాఖ సిబ్బంది అధ్యక్షుడు రామిశెట్టి రమేష్, దీకొండ రవికుమార్, లగడపాటి సురేష్, మీనా కుమారి, ప్రమీల కృష్ణకుమారి, యాదా రమణ, మల్లికార్జున్, సత్యనారాయణ, ఎస్. రామకృష్ణ, సిద్ధార్థ, జిల్లా కోర్టు సిస్టమ్ ఆఫీసర్ నరేష్, కోర్టు సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.