అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం :  ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో అర్హులకే మంజూరు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలన, పెండింగ్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులు, ధరణి దరఖాస్తులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే ఎంపిక చేయాలని సూచించారు. ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు సమన్వయంతో పనిచేసి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 జాబితాలను రూపొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నివేదికలు ఆమోదం పొందిన వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు.

అర్హుల జాబితా విషయంలో స్పష్టత:

ఎల్-1 జాబితాలో అర్హత లేని వారిని తొలగించి, తొలగించడానికి గల కారణాలను నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అర్హుల జాబితాలో తండ్రికి పేరు ఉన్నప్పటికీ, వివాహమైన కొడుకు కూడా అర్హత కలిగి ఉంటే, అటువంటి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. తండ్రి పక్క గృహంలో నివసిస్తూ వివాహమైన కొడుకు ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేస్తే, అర్హత ఉంటే, దానిని కూడా పరిగణించాలన్నారు.

జల్ సంచేయ్ జన్ భగీదారి అమలు:

జల్ సంచేయ్ జన్ భగీదారి (JSJB) అమలులో భాగంగా, 2024 ఏప్రిల్ నుండి జిల్లాలో చేపట్టిన ఇంకుడు గుంతలు, ఫామ్ పాండ్స్ నిర్మాణ వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు తవ్వించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

ఎల్ ఆర్ ఎస్, ధరణి దరఖాస్తులపై దృష్టి:

భూముల క్రమబద్ధీకరణకు మార్చి 31 వరకు 25% రాయితీని వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని, ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.