పెద్దమ్మ తల్లిగుడి కమిటీలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి - గంధం నరసింహారావు

పెద్దమ్మ తల్లిగుడి కమిటీలో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి - గంధం నరసింహారావు
జె.హెచ్.9. మీడియా, భద్రాద్రికొత్తగూడెం : పాల్వంచ పెద్దమ్మ తల్లి గుడి కమిటీలో కేశవాపురం - జగన్నాధపురం స్థానికులకు ప్రాతినిధ్యం ఇవ్వకుండా, సంబంధం లేని కొంతమంది వ్యక్తులతో కమిటీ నియామకం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని కేశవాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గంధం నరసింహారావు అన్నారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక ఏళ్లుగా కీలకంగా ఉన్న స్థానికులకు గుడి కమిటీలో ప్రాధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం పాల్వంచ ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన, కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవారు ఇప్పుడు పార్టీలో చేరి పదవులు ఆశిస్తున్నారని, ఆలయ కమిటీలో అలాంటి వారిని తీసుకోకుండా స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నూతనంగా ప్రచారం జరుగుతున్న కమిటీని రద్దు చేసి, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడిన స్థానిక కార్యకర్తలను గుర్తించి వారికి నామినేటెడ్ పదవులలో అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా మంత్రులను వారు కోరారు.

ఈ కార్యక్రమంలో అజ్మీర రమేష్ నాయక్, ఉడుగుల రాము, నరేష్, బండి ఉదయ్ కుమార్, నాగేష్, శేఖర్, వెంగళరావు, రాకేష్, సతీష్, మహేష్, అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Blogger ఆధారితం.